అప్పట్లో ఒకడుండేవాడు.. ఆరడుగుల ఆజానుబాహుడు.. టాలీవుడ్‌కు సరిగ్గా పునాదులు పడకముందే.. బాలీవుడ్‌లో రాజ్యమేలాడు. ఆయనే మన తెలంగాణ బంగారం.. పైడి జైరాజ్. దాదాపు 156 హిందీ చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించాడు. మూడు వందలకుపైగా చిత్రాల్లో నటించాడు. జైరాజ్ తర్వాత బాలీవుడ్ కోటలో ఆయనలా పాగా వేసిన తెలుగు నటుడు మరొకరు లేరు. పాన్ ఇండియా సినిమాలు రూపుదిద్దుకుంటున్నా.. మన హీరోలు గ్లోబల్‌స్టార్ ఇమేజ్ సంతరించుకుంటున్నా.. బాలీవుడ్‌పై పట్టు సాధించింది తక్కువే! మళ్లీ చాలా ఏండ్లకు ఎన్టీఆర్ డైరెక్ట్ హిందీ సినిమా ‘వార్-2’ మల్టీస్టారర్‌లో హీరోగా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో కన్నేసిన మన హీరోల ముచ్చట్లు చర్చించుకుందాం..
‘బాహుబలి’ వచ్చింది. తెలుగు సినిమాను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదలైంది. తెలుగు సినిమా గ్లోబల్ అయింది. ఇంటా, బయటా రచ్చ చేసిన సినిమాలెన్నో టాలీవుడ్‌లో ఇటీవల పుట్టుకొస్తున్నాయి. అయినా, మన హీరోలు వాళ్లకు డబ్బింగ్ స్టార్లే! పైడి జైరాజ్ తర్వాత ఐదారుగురు హీరోలు డైరెక్ట్ హిందీ చిత్రాలు చేసినా.. ఆయనకు వచ్చినంత గుర్తింపు వీరికి రాలేదనే చెప్పాలి. మూకీ సినిమాల్లో మొదలైన జైరాజ్ ప్రభంజనం టాకీలు వచ్చాక కూడా కొనసాగింది. హేమాహేమీ దర్శకుల నేతృత్వంలో మరపురాని సినిమాల్లో నటించాడు. టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ ఇలా చారిత్రక పాత్రలెన్నో ధరించాడు. పృథ్వీరాజ్‌కపూర్, రాజ్‌కపూర్, దిలీప్ కుమార్ లాంటి ఉద్దండ నటులను మించి కలెక్షన్లూ కొల్లగొట్టాడు. బాలీవుడ్ సినీపల్లకీలో ఊరేగిన ఈ మహానటుడి చరిత్రను టాలీవుడ్ గుర్తించకపోవడం మన దౌర్భాగ్యమే!
ఎన్టీఆర్‌కు.. ముచ్చటగా మూడు
తెలుగు సినిమా చక్రవర్తి, నవరస నటనా సార్వభౌముడు ఎన్టీఆర్ మూడు హిందీ సినిమాల్లో నేరుగా నటించాడు. ఆయన్ను మాస్ హీరోగా నిలబెట్టిన ‘పాతాళ భైరవి’ హిందీలోనూ విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, భానుమతి నటించిన ‘చండీరాణి’ కూడా హిందీ వెర్షన్‌లో వచ్చింది. ఈ సినిమా పోస్టర్‌లో ‘రిలీజింగ్ ఆల్ ఓవర్ ఇండియా’ అని ప్రకటించారు. ఆ లెక్కన 1953లోనే టాలీవుడ్ నుంచి తొలి పాన్ ఇండియా సినిమా వచ్చినట్టయింది. ఎన్టీఆర్ నటించిన మూడో హిందీ చిత్రం 1956లో విడుదలైన ‘నయా ఆద్మీ’. ఇందులో జమున, అంజలీదేవి కథానాయికలుగా నటించారు. సీపీ దీక్షిత్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలన్నీ షూటింగ్ సమయంలోనే తెలుగు, హిందీ రెండు వెర్షన్లలో నిర్మించారు. ఎన్టీఆర్ నటించిన చిత్రరాజం ‘లవకుశ’ హిందీలోకి డబ్ అయింది.










